తూప్రాన్ మున్సిపాలిటీలో ముసాయిదా మున్సిపల్ ఓటర్ జాబితా రేపు ప్రదర్శన
తూప్రాన్ డిసెంబర్31 (ప్రజాస్వరం)
అక్టోబర్ 1, 2025 న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన అసెంబ్లీ ఓటరు జాబితాను ప్రాతిపదికగా తీసుకొని, రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం మున్సిపల్ ఓటర్ జాబితాను వార్డు వారీగా విభజించి, తూప్రాన్ మున్సిపాలిటీకి సంబంధించిన ముసాయిదా మున్సిపల్ ఓటర్ జాబితాను రేపు అనగా జనవరి 1, 2026 న ప్రజల పరిశీలనార్థం ప్రదర్శించనున్నట్లు తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రా రెడ్డి తెలిపారు. ఈ రోజు తూప్రాన్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి, వార్డ్ వారిగా తయారు చేస్తున్న ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి తో కలిసి పరిశీలించి, సిబ్బంది కి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ,
తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 16 వార్డులకు సంబంధించి 32 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ముసాయిదా ఓటర్ జాబితాను ఉంచి, ప్రజల నుండి అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదు గానీ, ఉన్న ఓటర్ల పేర్ల తొలగింపు గానీ జరగదని స్పష్టం చేశారు. అయితే, వార్డు వారీగా జరిగిన విభజనలో ఒక వార్డుకు చెందిన ఓటరు పేరు వేరే వార్డులో నమోదై ఉంటే, అటువంటి అంశాలపై మాత్రమే అభ్యంతరాలు స్వీకరించి, సంబంధిత విచారణ అనంతరం అవసరమైన సవరణలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలన్నింటినీ పరిశీలించిన తరువాత, తుది మున్సిపల్ ఓటర్ జాబితాను జనవరి 10, 2026 న ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు RDO జయ చంద్రా రెడ్డి తెలిపారు.


