చెంచు గిరిజన భక్తులకు ఉచితంగా శ్రీస్వామివారి స్పర్శదర్శనం
అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు
చెంచుగిరిజనులకు ఉచిత స్పర్శదర్శనం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమం
దర్శనానంతరం చెంచు భక్తులకు అన్నప్రసాదాలను ఏర్పాటు చేసిన దేవస్థానం
దేవస్థానం కల్పించిన అవకాశం పట్ల హర్షం వ్యక్తం చేసిన చెంచు గిరిజనులు
శ్రీశైలం / హైదరాబాద్ , (ప్రజాస్వరం) :
ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించడం జరిగింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం రోజు ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.ఈ రోజు ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, సంబంధిత అధికారులు వారికి ఆహ్వానం పలికారు.
తరువాత చెంచు భక్తులందరు కూడా ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణను చేశారు. అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి వారికి శ్రీస్వామివారి స్పర్శదర్శనం, అమ్మవారి దర్శనాలను చేయించారు.
అనంతరం అన్నప్రసాదవితరణ భవనములో చెంచు భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలను ఏర్పాటు చేయబడ్డాయి. ధర్మకర్తలమండలి అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారివారు కూడా చెంచు భక్తులతో అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
స్థానిక మేకలబండ గిరిజనులతో పాటు పలు ఇతర గూడెములకు చెందిన చెంచు భక్తులకు కూడా ఈ రోజు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ తాము పదవీబాధ్యతలను స్వీకరించిన వెంటనే స్థానిక మేకలబండ చెంచుగూడెములను సందర్శించానన్నారు. ఆ సందర్భంలో చెంచు భక్తులు తమకు స్వామివారి స్పర్శదర్శనాన్ని కల్పించవలసినదిగా కోరడం జరిగిందన్నారు. తదనుగుణంగా ధర్మకర్తల మండలి సమావేశంలో చెంచుభక్తులకు నెలలో ఒకరోజున ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించాలని ధర్మకర్తల మండలి సమావేశములో తీర్మానించడం జరిగిందన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. శ్రీశైలక్షేత్ర సంస్కృతీ సంప్రదాయాలలో చెంచు భక్తులకు ఎంతో ప్రత్యేక స్థానము ఉందన్నారు. తరువాత కార్యనిర్వహణాధికారివారు మాట్లాడుతూ చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లుడిగా భావిస్తారన్నారు. దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే ప్రతీ సంవత్సరం శ్రావణమాసంలో జరిగే సామూహిక వరలక్ష్మీ వ్రతాలలో చెంచులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతోందన్నారు. ఇటీవల కార్తికమాసంలో జరిగిన కోటీదీపోత్సవ కార్యక్రమంలో కూడా గిరిజన చెంచు మహిళలను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి వారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు.


