రోడ్డుపై బైఠాయించిన రైతులు..
మా పొలాల వద్దకు దారి ఇవ్వండి..
లేకుంటే ఆత్మహత్యలే మాకు శరణ్యం..
వ్యవసాయ భూములకు అడ్డంగా ఉన్న వెంచర్..
వ్యవసాయ భూములకు వెళ్లడానికి దారి లెక్క ఇబ్బందులు పడుతున్న రైతులు..
సమస్యను పరిష్కరించిన తహసిల్దార్ గ్రేస్ బాయి..
నార్సింగి డిసెంబర్ 29 (ప్రజా స్వరం)
రియల్టర్లు తమ స్వలాభం కోసం సరైన అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తూ ప్రభుత్వ ఖజానా కు గండి కొట్టడమే కాకుండా పరిసర రైతులకు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, నార్సింగి మండల పరిధిలోని శంఖాపూర్ గ్రామంలో సర్వే నం. 278/పీ, 279/పీ లలో గల 2.48 ఎకరాల లో అనుమతులు తీసుకుని, దాని తో పాటు సర్వే నం 280, 281 లో గల 2.07 ఎకరాలలో ఎలాంటి అనుమతులు లేని భూమిలో శ్రీకర హౌసింగ్ పేరుతో వెంచర్ ను ఏర్పాటు చేశారు. వెంచర్ ఏర్పాటు చేయడం తో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం, గేట్ ఏర్పాటు చేశారు. ప్రహరీ గోడ నిర్మాణం, గేట్ అమర్చి తాళం వేయడం తో వెంచర్ వెనుక వైపు పొలాలు ఉన్న రైతులకు తమ పొలాలకు రాకపోకలకు సాగించడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ తీసుకుని పోవడానికి ఇబ్బందులు ఎదురు కొంటున్నారు. గోడ నిర్మాణం సమయం లో సంబంధిత రైతులు అభ్యంతరం తెలిపితే తమ భూములను కాపాడడానికి గోడ, గేట్ నిర్మిస్తున్నామని, తాళం చెవి గ్రామానికి చెందిన వ్యక్తి (వెంచర్ వాచ్మెన్) వద్ద ఉంచుతామని, మీకు అవసరమైనప్పుడు గేట్ తెరుస్తామని వెంచర్ వారు హామీ ఇచ్చారు. 15 అక్టోబర్ నాడు గేట్ తెరవకుండా తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పంట చేతికి అంది వచ్చే సమయం లో ఇదేంటని, దారి ఇస్తామని ఇబ్బందులకు గురి చేయడం ఏమిటని ప్రశ్నిస్తూ రైతులు వెంచర్ ముందు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న శంఖాపూర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక రైతుల సమక్షం లో వెంచర్ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను తీర్చారు. మళ్ళీ సోమవారం ఉదయం రైతులు తమకు నాట్లు వేయడానికి తాళం తీయడం లేదని, గత నెల రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారని, నారు ముదిరిపోతుందని, నాట్లు వేసే సమయం కూడా మించి పోతుందని, తాము వ్యవసాయం చేయడం, బ్రతకడం ఎలా అని ఆందోళన పడుతూ వెంచర్ ముందు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శి మౌనిక చేరుకుని రైతులను సముదాయించడానికి ప్రయత్నించారు. కానీ, రైతులు ఆర్డీఓ రావాలని, తమ సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. స్థానిక తహసీల్దార్ గ్రేస్ బాయి, ఆర్ ఐ మేఘన, జీపీఓ వైష్ణవి తో పాటు చేరుకుని రైతులతో చర్చించారు. గతం లో కూడా పంచాయతీ కార్యదర్శి మౌనిక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారని, వెంచర్ నిర్వాహకులు తాత్కాలికంగా తాళం తీసి మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆర్డీఓ వచ్చి తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు పట్టారు. తాము దారి విషయమై మూడు నెలల క్రితం ప్రజా వానిలో కలెక్టర్ కు దరఖాస్తు చేశామని అన్నారు. గత వారం లో ఇదే విషయమై డీపీఓ కు కూడా దరఖాస్తు చేసుకున్నామని తెలిపారు. గత వారం లో తహసీల్దార్ రైతులను పిలిపించి సర్వేయర్ ట్రైనింగ్ లో ఉన్నారని, తిరిగి వచ్చాక సర్వే జరిపి పరిష్కరిస్తానని అన్నారని, ఇప్పటి వరకు ఎలాంటి పరిష్కారం జరగలేదని వాదించారు. ఇలా సాగదీస్తూ పోతే తాము నాట్లు వేసేది ఎప్పుడని, వ్యవసాయం చేయకపోతే ఎలా బ్రతకాలని, తమకు చావే శరణ్యం అని ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్ గ్రేస్ బాయి, స్థానిక ఎస్ఐ బీమరి సృజన రైతులను సముదాయిస్తూ వెంచర్ నిర్వాహకులతో మాట్లాడి సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతామని అన్నారు. వీలైనంత త్వరగా సర్వే జరిపి నక్షా లో రోడ్డు ఉంటే ఖచ్చితంగా రోడ్డు ను వదిలేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంచర్ నిర్వాహకులతో ఫోన్ లో మాట్లాడి గెట్ తాళం తీసే విధంగా తాళం చెవులు రైతులకు అందుబాటులో ఉండే విధంగా పంచాయతీ కార్యదర్శి వద్ద ఉంచేలా ఒప్పించారు.


