బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి....
పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కఠిన చర్యలు....
ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి...
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు...
మెదక్ డిసెంబర్ 30 (ప్రజా స్వరం)
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ శాఖల సంబంధిత అధికారులతో జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రమాదకరమైన ప్రాంతాల్లో పని చేస్తున్న పిల్లలను, తప్పిపోయిన పిల్లలను గుర్తించి రక్షించడం, వారికి పునరావాసం కల్పించడం, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టుబడిన పిల్లలను వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించాలని, తల్లిదండ్రులకు అవసరమైన కౌన్సెలింగ్ అందించాలని, అనాథ పిల్లలను కేర్ హోమ్‌లకు తరలించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 1098 కు సమాచారం ఇవ్వాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ప్రతి ఏటా జనవరి 1 నుండి జనవరి 31 వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో, వివిధ శాఖల అధికారుల సమన్వయంతో నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అవసరమైన ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీఓ జయచంద్ర రెడ్డి, జిల్లా డీడబ్ల్యూఓ హైమావతి, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ నుంచి ఉప్పలయ్య, లేబర్ డిపార్ట్‌మెంట్ డీసీపీవో సత్యేంద్ర ప్రసాద్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


