పక్కా ప్రణాళిక ప్రకారం వైకుంఠ ఏకాదశి దర్శనాలు
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల / హైదరాబాద్ (ప్రజాస్వరం):
వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించాం . భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం 2-3 కంపార్ట్మెంట్లలో మాత్రమే వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు. రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలు తెరిచారు. నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా పూర్తి చేసి, వేకువజాము 1:25 వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించాం. మూడు గంటల సమయం మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయించామని అన్నారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేయబడ్డాయి. ఉదయం 4:30 గంటల నుండి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన స్లాట్ల ప్రకారం సర్వ దర్శనం ప్రారంభించాం. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో మరియు అనౌన్స్మెంట్ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాం. టోకెన్స్ లేని భక్తులు 2 తేదీ నుంచి 8 వ తేదీ వరకు తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శించుకోవాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు అప్డేట్స్ ఇస్తున్నాం. సుమారు 3,500 మంది పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అన్నప్రసాదం, ఇతర మౌలిక సదుపాయాల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని సూచించారు.


