బొల్లారం పోలీస్ స్టేషన్ తరలింపు ఆపాలి: డీజీపీకి ఎమ్మెల్సీ అంజి రెడ్డి వినతి
బొల్లారం, జనవరి 2 (ప్రజా స్వరం):
బొల్లారం పోలీస్ స్టేషన్‌ను అమీన్‌పూర్‌కు తరలించే ప్రతిపాదనను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ అంజి రెడ్డి, బొల్లారం బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
బొల్లారం ప్రాంత ప్రజల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ స్టేషన్‌ను బొల్లారంలోనే కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్‌ను అమీన్‌పూర్‌కు తరలిస్తే స్థానిక ప్రజలకు, ముఖ్యంగా వృద్ధులు, మహిళలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని, శాంతిభద్రతల పర్యవేక్షణకు కూడా ఆటంకం ఏర్పడుతుందని వారు వివరించారు.
ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొందని, ఆందోళనలను పరిగణలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలింపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డీజీపీని కోరారు. స్పందించిన డీజీపీ, పోలీస్ స్టేషన్ యథావిధిగా కొనసాగించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డీజీపీని కలిసిన వారిలో టి.రవీందర్ రెడ్డి, భరత్ చారి, శ్రీకాంత్, యశ్వంత్, అఖిల్ తదితరులు ఉన్నారు.


