వ్యవసాయ పనుల్లో అప్రమత్తత లోపం..
కుటుంబాన్ని ముంచిన విషాదం
కరెంట్ షాక్‌తో రైతు మృతి దౌల్తాబాద్ డిసెంబర్ 20( ప్రజాస్వరం)
వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్న ఓ రైతు కరెంట్ షాక్‌కు గురై మృతి చెందిన హృదయవిదారక సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గ్రామస్తుల కథనం ప్రకారం దౌల్తాబాద్‌కు చెందిన తుమ్మల ఎల్లయ్య అలియాస్ ఎల్లం (47) అనే రైతు ప్రతిరోజు మాదిరిగానే వ్యవసాయ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. దౌల్తాబాద్ మండల పరిధిలోని బ్రహ్మం అలియాస్ బ్రహ్మచారి భూమిలో ఉన్న వ్యవసాయ స్టాటర్ వద్ద మరమ్మతులు చేస్తుండగా, అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా రావడంతో కరెంట్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి ఏకైక ఆధారమైన ఎల్లయ్య మృతితో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


