ఈవ్ టీజింగ్‌పై 2 ఎఫ్‌ఐఆర్‌లు, 7 ఈ–పెట్టి కేసులు నమోదు....
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు....
డిసెంబర్ లో 64 మందికి కౌన్సెలింగ్, 38 అవగాహన కార్యక్రమాలు...
మహిళల భద్రతకు షీ–టీమ్స్ తో కట్టుదిట్టమైన చర్యలు....
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు....
మెదక్ డిసెంబర్ 31 (ప్రజా స్వరం)
మెదక్ జిల్లాలో మహిళలు, బాలికల భద్రతకు షీ–టీమ్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన వారిపై 02 ఎఫ్‌ఐఆర్‌లు, 07 ఈ–పెట్టి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. రెడ్ హ్యాండ్‌గా తూప్రాన్ సబ్‌డివిజన్‌లో 16 మంది, మెదక్ సబ్‌డివిజన్‌లో 48 మంది మొత్తం 64 మందిని పట్టుకుని కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, బస్ స్టాప్‌లు, రద్దీ ప్రాంతాల్లో 38 అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా మహిళలను లేదా బాలికలను వేధించినా, అవహేళనగా మాట్లాడినా, ఉద్దేశపూర్వకంగా వెంబడించినా వెంటనే డయల్–100 లేదా షీ–టీమ్ వాట్సాప్ నంబర్ 8712657963 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. 18 సంవత్సరాలు నిండకముందే బాలికల వివాహాలు జరిగితే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. మెదక్ జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రారంభించామని, మనుషుల అక్రమ రవాణా లేదా ఆర్గనైజ్డ్ నేరాలపై సమాచారం అందించాలని తెలిపారు. ఈ షీ–టీమ్స్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో షీ–టీమ్ సిబ్బంది, ఎఎస్‌ఐ వెంకటయ్య, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుళ్లు ప్రమీల, విజయ్, స్వరూప, గంగామణి, హెచ్‌జీలు విజయ రాణి, సురేష్ కుమార్ తమ తమ డివిజన్లలో విధులు నిర్వహిస్తున్నారు.


