ఆమీన్పూర్ లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
నూతన సంవత్సర వేడుకల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు – అమీన్‌పూర్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
పటాన్ చెరు ( ప్రజాస్వరం ):
నూతన సంవత్సరం 2026 సందర్భంగా ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కట్టుదిట్టంగా నిర్వహించారు.
ఈ తనిఖీలు ఎస్‌పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ ప్రభాకర్ పర్యవేక్షణలో, సీఐ నరేష్ మార్గనిర్దేశంలో అమీన్‌పూర్ పోలీస్ సిబ్బంది చేపట్టారు.
అమీన్‌పూర్ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్లు రామాంజనేయులు మరియు విజయ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలలో ప్రధాన రహదారులు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో వాహనాలను ఆపి బ్రెత్ అనలైజర్ ద్వారా డ్రైవర్లను పరీక్షించారు.
నూతన సంవత్సరం వేడుకల సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ,
“ప్రజలు నూతన సంవత్సరాన్ని సురక్షితంగా జరుపుకోవాలంటే మద్యం సేవించి వాహనం నడపకూడదు. చట్టాన్ని గౌరవిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో రోడ్లపై శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, ముందస్తు చర్యలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని స్థానికులు అభినందించారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న అమీన్‌పూర్ పోలీస్ సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.


