మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది : భారత ప్రధాని నరేంద్ర మోడీ
మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది
భారత ప్రధాని నరేంద్ర మోడీ
రోడ్డు మార్గంలో మణిపుర్ కు ..ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మణిపుర్ / ఢిల్లీ సెప్టెంబర్ 13 (ప్రజాస్వరం) :
మణిపుర్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించారు. ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. .మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. . రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ వాసులు పలికిన స్వాగతం మర్చిపోలేనని, మువ్వెన్నల జెండాలు చేతబట్టి తనకు ఘనంగా స్వాగతం పలికారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మణిపుర్ పేరులోనే మణి ఉందని అది దేశానికే మణి వంటిదని, మణిపుర్ దేశానికి ప్రకృతి ఇచ్చిన బహుమతి అని కొనియాడారు.మణిపుర్ ను వేగంగా ప్రగతి పథంలో పయనింపజేస్తాం అని మణిపుర్ కోసం రూ.7 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. మణిపుర్ ను దేశంతో అనుసంధానం చేసే ప్రాజెక్టులు చేపడుతున్నామని, రైలు, రోడ్డు మార్గాల కోసం మణిపుర్ కు నిధులు కేటాయిస్తున్నామని అన్నారు. రూ. 8 వేల కోట్లతో జాతీయ రహదారుల పనులు వేగంగా కొనసాగుతున్నాయని, మణిపుర్ లో రైల్ కనెక్టివిటీ భారీగా పెంచుతున్నామని మోడి పేర్కొన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుందని చెప్పారు. ప్రస్తుతం మణిపుర్ చేపడుతున్న ప్రాజెక్టులతో మౌలిక సదుపాయాలు, వైద్యసేవలు మెరుగవుతాయని, ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా అనేక వివాదాలు, ఉద్యమాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంటోందని, శాంతి స్థాపన ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని వెల్లడించారు. శాంతి స్థాపన ద్వారా తమ భావితరాల భవిష్యత్తు బావుంటుదని, మణిపుర్ ప్రజల వెంట భారత ప్రభుత్వం ఉందని మోడి స్పష్టం చేశారు.