స్థానిక సంస్థల ఎన్నికల కేసు నవంబర్ 24కు విచారణ వాయిదా
హైదరాబాద్, నవంబర్ 3 (ప్రజాస్వరం) :
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌ను స్టేట్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తూ అక్టోబర్ 9న ఉత్తర్వులు జారీ చేసి విషయం తెలిసిందే. అయితే, ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని ప్రభుత్వంతో పాటు, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే, వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్నికల నిర్వహణపై బెంచ్కు తమ అభిప్రాయం తెలిపేందుకు మరింత గడువు కావాలని కోరారు. మరోవైపు ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తెలిపింది. దీంతో కేసులో తదుపరి విచారణకు ధర్మాసనం ఈ నెల 24కు వాయిదా వేసింది.


