రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం : బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ / భువనగిరి నవంబర్ 3 (ప్రజాస్వరం) :
రాష్ట్రంలో తుఫాన్ తో 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని బిజెపి శాసనసభ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. భువనగిరిలో ఆయన మీడియా తో మాట్లాడుతూ రైతులు కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి ముంబై లో సల్మాన్ ఖాన్ తో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు. రైతులకు నష్ట పరిహారం రాలేదు. ఎకరాకు 10 వేలు నష్టపరిహారం ఇస్తా అని ఇవ్వలేదు. జూబ్లీ హిల్స్ ఎన్నికల నేపథ్యంలో ఎకరాకు 10 వేలు ఇస్తా అంటున్నారు మొన్న జరిగిన మే నెలలో 55 వేల ఎకరాల్లో పంట నష్టం, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 2.50 లక్షల ఎకరాల్లో పంట నష్టం. ఇప్పుడు తుఫాను తో చాలా నష్టం జరిగింది వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, పంట నష్టం కు 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. ఎకరాకు రైతుకు పెట్టుబడి 30 వేలు అవుతుంది. కనీసం పెట్టుబడి నష్టం జరగవద్దు అంటే 30 వేలు పరిహారం ఇవ్వాలి. కేంద్రం ఇచ్చే పంట భీమా లో రాష్ట్రం భాగస్వాములు కావటం లేదు. పంట నష్టం, సబ్సిడీ, బోనస్ ఇవ్వటం లేదు.. రుణ మాఫీ అందరికీ ఇవ్వలేదన్నారు.


