బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . : జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.
బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి . :
జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు.
జిల్లా వ్యాప్తంగా 8 కేసుల నమోదు...
మెదక్ జూలై 10 (ప్రజా స్వరం)
రాష్ట్రవ్యాప్తంగా జూలై 1 నుండి ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన సందర్భంగా పది రోజుల వ్యవధిలో మెదక్ జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందని, అన్ని శాఖల సమిష్టి కృషితో బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలిద్దామని జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం మెదక్ జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల సమన్వయంతో సమావేశంలో జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో ముఖ్యంగా హోటల్లు నందు, ఇటుక బట్టీల నందు, నిర్మాణ పనుల నందు, వ్యాపార సముదాయాల నందు పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి వారిని తల్లిదండ్రులకు గాని సంరక్షణ గృహాలకు కానీ చేర్చి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా కర్షకులుగా కొనసాగరాదని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 41 మంది బాలలను రక్షించి తల్లిదండ్రులకు, సంరక్షణ స్థలాలకు చేర్చడం జరిగిందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 8 కేసులను నమోదు చేసినట్లు, బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమం నెల రోజుల పాటు నిర్వహించనున్నట్లు అన్ని శాఖల సమిష్టి కృషితో కొనసాగాలని ప్రతి రోజు జిల్లాలోని అన్ని మండల కేంద్రాలను గ్రామాలను సందర్శిస్తూ బాల కార్మికులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మధు సుధన్ గౌడ్, సీడీపీఓ కరుణ శ్రీ, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉప్పలయ్య, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, ఎన్జీవోస్ సభ్యులు, రెండు డివిజన్ లకు చెందిన ఆపరేషన్ ముస్కాన్ టీం లు పాల్గొన్నారు.