అకాల వర్షం బీభత్సం......

అకాల వర్షం బీభత్సం......

చేతికొచ్చిన పంట నేలపాలు….

రైతన్నలకు కన్నీటి కష్టాలు …

 

ప్రజాస్వరం : వెల్దుర్తి / తూప్రాన్ ఏప్రిల్ 20

 

మెదక్ జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షం అన్నదాతను నిండా ముంచేసింది. సాయంత్రం వేళ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం, వడగండ్ల వాన పడటంతో వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

శంశిరెడ్డిపల్లి తండాలో నేలరాలిన వరి 

మండలంలోని శంశిరెడ్డిపల్లి తండాలో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నేలకొరిగింది. మూడు నెలల పాటు రేయింబవళ్లు కష్టపడి, అప్పులు చేసి సాగుచేసిన పంట వడగండ్ల వానకు దెబ్బతింది. గింజలన్నీ నేలరాలి, కంకులు పొలంలోనే రాలిపోవడంతో పెట్టుబడి కూడా దక్కని దుస్థితి ఏర్పడిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు .పంట చేతికి వచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేసింది. కౌలు రైతులం మేం ఇక అప్పులు ఎలా తీర్చాలి పిల్లలను ఎలా పోషించాలి అంటూ బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

చెర్లపల్లిలో మామిడి తోటకు తీవ్ర నష్టం.

మరోవైపు మండల పరిధిలోని చెర్లపల్లి గ్రామానికి చెందిన నాజీమ్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఈదురు గాలుల ధాటికి కోతకు వచ్చిన కాయలన్నీ నేలరాలిపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తోట మొత్తం చెల్లాచెదురైందని, లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతు నాజీమ్ వాపోయారు. ఏడాది మొత్తం తోటను కంటికి రెప్పలా కాపాడుకున్నాం. అమ్ముకునే సమయానికి ఇలా జరగడంతో కుటుంబం రోడ్డున పడింది అని ఆయన తెలిపారు.

ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్:

వర్షం కారణంగా వరి, మామిడితో పాటు మండలంలో పలుచోట్ల కూరగాయ పంటలు కూడా దెబ్బతిన్నాయి. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి ఎకరానికి ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు తగిన పరిహారం చెల్లించి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, లేకపోతే తాము అప్పుల ఊబిలో కూరుకుపోతామని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.