మాలలకు రెండు శాతం రిజర్వేషన్ పెంచాలి.....
మాలల హక్కుల సాధన సమితి డిమాండ్......
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాల మంత్రులు వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ చైర్మన్ డా. మందాల భాస్కర్ విజ్ఞప్తి.....
తెలంగాణ రాష్ట్రంలో మాలలపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోందని, రాష్ట్రంలో మూడో అతిపెద్ద జనాభా కలిగిన మాలలకు మరో రెండు శాతం రిజర్వేషన్ పెంచాలని మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ డా. మందాల భాస్కర్ డిమాండ్ చేశారు. ఆదివారం మెదక్ పట్టణంలో మాలల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది మాలలు ఉన్నప్పటికీ ఉద్యోగ నోటిఫికేషన్లు, సంక్షేమ కార్యక్రమాల్లో వారికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఈ పరిస్థితి కొనసాగితే మాల సమాజం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లు మాల సంఘాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న), చెరుకు రామచందర్, మాదాసు రాహుల్ రావు, మంత్రి నరసింహయ్య, గోపోజు రమేష్, మన్నే శ్రీధర్, డీబీఎస్ శంకర్, తుమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులు బొమ్మల మైసయ్య, పెంటయ్య సభ కు అధ్యక్షత వహించారు. సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని 59 కులాలకు సమాన న్యాయం జరిగేలా అమలు చేయాలని, అత్యంత వెనుకబడిన మాలల కోసం ప్రత్యేక మాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ లో మాల భవన్ కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించాలని, ఇప్పటివరకు విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లు ను రద్దు చేసి సమాన న్యాయం జరిగే విధంగా కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేశారు.


