విద్యుత్ టవర్ ఎక్కి యువకుడు హల్ చల్ ...
తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ చేయాలి...
ఎమ్మెల్యే హామీతో దిగివచ్చిన యువకుడు..
చేగుంట, ఏప్రిల్ 04 ( ప్రజాస్వరం )
:
గతంలో అమలులో ఉన్న విధంగానే తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏ వ్యవస్థను పునరుద్ధరించి, నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ టవర్ ఎక్కిన యువకుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హామీ ఇవ్వడంతో చివరకు సురక్షితంగా కిందకు దిగాడు.శుక్రవారం మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన ప్రదీప్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం 12 గం ప్రాంతంలో టవర్ ఎక్కి ఆందోళనకు దిగాడు. మస్కూరి ఉద్యోగంతో పాటు పాత వీఆర్ఏ వ్యవస్థను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశాడు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, గ్రామస్తులతో కలిసి అతడిని కిందకు దించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడికి చేరుకుని సమస్యలను పరిశీలించి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో దాదాపు 6 గంటల ప్రదీప్ తన ఆందోళన విరమించి టవర్ నుంచి దిగివచ్చాడు.ఈ ఘటనతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ యువకుడు సురక్షితంగా దిగడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించారు.


