ఒక్కరి నిర్లక్ష్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తుంది....
ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు....
ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతి
ప్రమాదాలు విధి కాదు – మన నిర్లక్ష్య ఫలితమే
తూప్రాన్, మార్చి 30 (ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ అగర్వాల్ కంపెనీలో “Arrive Alive” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా మాత్రమే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణాలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇంటి పెద్ద రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని, ఒక్కరి నిర్లక్ష్యం వల్ల కుటుంబం ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతుందని అన్నారు. “ప్రమాదం ముందస్తుగా చెప్పి రాదు” అనే విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
దేశవ్యాప్తంగా ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో రోజుకు సగటున సుమారు 450 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతుండగా, గత సంవత్సరం దేశవ్యాప్తంగా సుమారు 1.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి, 3 లక్షల మంది గాయపడ్డారని వివరించారు.
తూప్రాన్ ,మెదక్ జిల్లాలో గత సంవత్సరం 287 మంది మృతి చెందగా, 631 మంది గాయపడ్డారని తెలిపారు. ఇవి కేవలం గణాంకాలు మాత్రమే కాదని, ప్రతి ప్రమాదం వెనుక ఒక కుటుంబం కన్నీరు ఉందని అన్నారు. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 60 శాతం ద్విచక్ర వాహనాలకు సంబంధించినవేనని వెల్లడించారు.
జిల్లాలో గత సంవత్సరం చేపట్టిన వాహన తనిఖీల ద్వారా సుమారు 69 రోడ్డు ప్రమాద మరణాలను నివారించగలిగామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేయడం ద్వారా ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు.
మైనర్లు వాహనాలు నడపకూడదని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ— ద్విచక్ర వాహనదారులు రైడర్, పిలియన్ ఇద్దరూ ISI ప్రమాణిత హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపకూడదని, అతివేగం, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయరాదని, ఎడమ వైపు నుంచి ఓవర్టేక్ చేయకూడదని తెలిపారు.
ఇటీవల శంకరంపేట్ మండలంలో జరిగిన ఒకే బైక్ ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనను ఉదాహరణగా పేర్కొంటూ, ప్రమాదాల ముందు ఎవరూ అతీతులు కారని అన్నారు.
చివరగా, ప్రమాదాలు విధి కాదని, మన నిర్లక్ష్య ఫలితమేనని స్పష్టం చేస్తూ— మన కుటుంబాల భద్రత కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ కోరారు. కార్యక్రమం ముగింపులో సిబ్బంది, కార్మికులతో రోడ్డు భద్రతపై అవగాహనా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో తూప్రాన్ డియస్పి నరేందర్ గౌడ్, సిఐ లు సందీప్ రెడ్డి కృష్ణమూర్తి రంగకృష్ణ, ఎసై లు సుభాష్ గౌడ్, గంగరాజు రాజు, ఎంఎస్ అగర్వాల్ అధికారులు, కార్మికులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


