శివాజీ విగ్రహం ఏర్పాటు పై వదంతులను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.. .

సీఐ వెంకట రాజు గౌడ్

శివాజీ విగ్రహం ఏర్పాటు పై వదంతులను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు.. .

నార్సింగి, జనవరి 31 ( ప్రజాస్వరం ) :

మండల కేంద్రంలో నిర్మాణం లో ఉన్న ఛత్రపతి శివాజీ విగ్రహం పై వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ హెచ్చరించారు. నార్సింగి లో శివాజీ విగ్రహ ఏర్పాటు చేయడం పై కొందరు అభ్యంతరం చేశారంటూ వాట్సాప్ గ్రూపు లలో మెసేజ్ లు వైరల్ కావడంతో సీఐ వెంకట్ రాజా గౌడ్, స్థానిక ఎస్ఐ బీమరి సృజన, సిబ్బంది తో పాటు స్వయంగా నార్సింగి కి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ స్థానిక యువత, నాయకులు, సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్, తహసీల్దార్ గ్రేస్ బాయి, ఈ.ఓ నాగ భూషణం తో శివాజీ విగ్రహం ఏర్పాటు చేస్తున్న ప్రదేశంలోనే మాట్లాడారు. సోషల్ మీడియా లో ప్రచారం జరిగినట్లుగా ఇప్పటి వరకు శివాజీ విగ్రహం ఏర్పాటు పై ఎవరూ అభ్యంతరం చేయలేదన్న విషయం విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రానికి చెందిన కొందరు బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు కు స్థలం కేటాయించాలని ఈఓ నాగభూషణం కు వినతిపత్రం అందచేసారని, కానీ శివాజీ విగ్రహ స్థాపనకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదని, దానినే కొందరు వక్రీకరిస్తూ శివాజీ విగ్రహం ఏర్పాటు పై అభ్యంతరాలు చేస్తున్నారని వదంతులు సృష్టించారని అన్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలను కుంటున్న ప్రదేశంలో భవిష్యత్తు లో రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, ఆ అంశాన్ని మరోసారి పరిశీలించాలని, అవసరమైన అన్ని అనుమతులు తీసుకుని భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లు అన్నింటినీ పోలీసులు పర్యవేక్షిస్తున్నారని సీఐ వెంకట్ రాజా గౌడ్ తెలిపారు.

Latest News