జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

జాతీయ రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచండి..

పటాన్ చెరు, జనవరి 31(ప్రజాస్వరం):

బిహెచ్ఇఎల్ చౌరస్తా నుండి రుద్రారం గణేష్ గడ్డ మీదుగా సంగారెడ్డి వరకు చేపడుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయని, సర్వీస్ రోడ్లు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చి ప్రధాన రహదారి పనులను చేపట్టాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 

శనివారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ రహదారి సంస్థ అధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామచంద్రాపురం, పటాన్చెరు, ముత్తంగి ప్రాంతాలలో రహదారి విస్తరణ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా ఉండటం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు వాహనదారులు ప్రమాదాలకు గురై చనిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వైపు నుండి సంపూర్ణ సహకారం అందిస్తున్న పనులు ఎందుకు పూర్తి కావడం లేదని ఆయన ప్రశ్నించారు. రాబోయే నెల రోజుల్లో గా సర్వీస్ రోడ్లు పూర్తి చేయాలని లేని పక్షంలో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. రహదారుల నిర్మాణ సమయంలో ప్రభుత్వ శాఖలతో ఇబ్బందులు ఎదురైతే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జాతీయ రహదారుల సంస్థ డి ఈ రామకృష్ణను ఆదేశించారు.

Latest News