జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు....

స్పందించిన సర్పంచ్..

జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు....

ప్రయాణికుల కోసం చలవ పందిరి వేయించిన సర్పంచ్ సుజాత మల్లేశం గౌడ్..

 

నార్సింగి, ఏప్రిల్ 09 ( ప్రజాస్వరం ):

 

నార్సింగి మండల కేంద్రం జాతీయ రహదారి 44 పైనే ఉన్నా ప్రయాణికులకు సౌకర్యాలు మాత్రం సున్నా అన్న చందంగా నార్సింగి పరిస్థితి ఉంది. నిత్యం వందలాది విద్యార్థులు చదువుల కోసం, పొట్ట చేత పట్టుకుని ఉద్యోగులు, చిరు వ్యాపారులు నార్సింగి మండల కేంద్రం నుంచి ఇటు నిజామాబాద్ అటు మేడ్చల్, హైదరాబాద్ వైపు ప్రయాణాలు సాగిస్తూనే ఉంటారు. మండలంగా ఏర్పడితే అభివృద్ధి, సౌకర్యాలు మెరుగు పడతాయని భావించి కొట్లాడి ప్రత్యేక మండలాన్ని సాధించుకున్న ఇక్కడి ప్రజల ఆశలు అడియాశలే అయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాల కోసం స్వంత భవనాలు లేక, కనీసం ప్రయాణాలు చేద్దాం అన్నా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ నిలువ నీడ లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. రహదారి నిర్మాణం సమయంలో బస్టాండ్ ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు పై ఊరుకు దాదాపు అర కిలోమీటర్ దూరంలో నిర్మించడం, రహదారి తప్ప సర్వీస్ రోడ్డు పై బస్సులు రాకపోవడం తో ప్రయాణికులు నిత్యం నరకం అనుభవించాల్సి వస్తుంది. ప్రయాణికుల ఇబ్బందులు పై స్పందించిన నార్సింగి సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ ప్రయాణికుల ఉపశమనం కోసం గురువారం పందిరి నిర్మించి తాత్కాలిక బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుజాత మాట్లాడుతూ ఇక్కడి నుంచి నిత్యం వందల మంది చదువులు, ఉద్యోగాలు, వ్యాపారం కోసం ప్రయాణాలు సాగిస్తారని, ఎన్నో ఏండ్లుగా సరైన బస్ స్టాప్ లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపారు. బస్ స్టాండ్ విషయంలో ఎన్నోసార్లు పత్రికలలో కథనాలు రాసినా, సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఎండలు ఇప్పటికే మండుతున్నాయి అని, మునుముందు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉండడం తో ప్రజల సౌకరార్థం తాత్కాలిక షెడ్డు ను ఏర్పాటు చేశామని అన్నారు. సంబంధిత అధికారులు నార్సింగి లో అన్ని డిపోల బస్సులు నిలిచేలా, ప్రయాణికుల సౌకర్యం కోసం బస్ స్టాండ్ ఏర్పాటు చేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా నే అయినా బస్ షెల్టర్ ఏర్పాటు చేసి, ఉపశమనం కల్పించిన సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశ్ గౌడ్ కు ప్రజలు కృతఙ్ఞతలు తెలిపారు.