శ్రీకర వెంచర్ ప్రహరీ గోడను తొలగించిన అధికారులు...

కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన రైతులు....

శ్రీకర వెంచర్ ప్రహరీ గోడను తొలగించిన అధికారులు...

 

నార్సింగి, ఏప్రిల్ 07 ( ప్రజాస్వరం ):

 

శంఖాపూర్ రైతులు తమ కష్టాలను తీర్చిన అధికారులు, సమస్యను అధికారులు దృష్టి లోకి తెచ్చిన, సమస్య పరిష్కరించే విధంగా కృషి చేసిన విలేఖరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వివరాలలోకి వెళ్తే మండల పరిధిలోని శంఖాపూర్ లో సర్వే నం 278, 279, 280, 281 లలో దాదాపు 4.55 ఎకరాలలో 2023-24 సం లో పూర్తి అనుమతులు పొందకుండా, నియమ నిబంధనలకు విరుద్ధంగా శ్రీకర హౌసింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ వారు వెంచర్ ఏర్పాటు చేశారు. పొందిన అరకొర అనుమతులలో ఓపెన్ వెంచర్ గా నమోదు చేయించి, పరిసర రైతులకు తమ వ్యవసాయ పొలాలకు దారి ఇవ్వకుండా అక్రమంగా ప్రహరీ గోడలు, గేటు ఏర్పాటు చేసుకున్నారు. గోడలు, గేటు నిర్మాణ సమయంలో రైతులు అభ్యంతరం తెలిపినా రైతుల రాకపోకల కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గేటును తెరిచే ఉంచుతామని హామీ ఇచ్చారు. అనంతరం గేటుకు తాళం వేసిన నిర్వాహకులతో ప్రశ్నించిన రైతులను భూమి తమకు అమ్మాలని, లేదా దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ బెదిరింపులకు దిగారు. నాట్లు వేసే సమయం మించినా, నాట్లు వేయడానికి వీలు లేకుండా చేస్తున్నందుకు ఒకసారి, చేతికంది వచ్చిన తమ పంటల కోతల సమయం మించి పోతున్నా కోతలకు వీలు లేకుండా చేస్తున్నారని ఒక సారి వెంచర్ పరిసర రైతులు రోడ్డు పై బైఠాయించి రాస్తా రోకో చేశారు. అప్పట్లో స్పందించిన తహసీల్దార్ గ్రేస్ బాయి, ఎస్ఐ బీమరి సృజన వెంచర్ నిర్వాహకులతో మాట్లాడి గేటు తాళం చెవిని పంచాయతీ కార్యదర్శి మౌనిక వద్ద ఉంచేలా ఏర్పాట్లు చేశారు. అంతకు ముందు రైతులు తమ సమస్య పరిష్కారం చేయాలని ప్రజావాణి లో కలెక్టరేట్ లో అర్జీ ఇచ్చారు. సమస్య శాశ్వత పరిష్కారం కాకపోయినా కాస్త ఉపశమనాన్ని పొందిన రైతుల కథ మళ్ళీ మొదటికి వచ్చింది. తమ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఎంతో ఆశతో రైతులు మళ్ళీ కలెక్టరేట్ లో ప్రజావాణి లో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. వెంచర్ నిర్వాహకుల ఆగడాల పై మా నవతెలంగాణ పత్రిక లో వరుస కథనాలను ప్రచురితం చేస్తూ సమస్యను అధికారులు దృష్టి పదేపదే తేవడం జరిగింది. సమస్య పై స్పందించిన అప్పటి కలెక్టర్ రాహుల్ రాజ్ సమస్య ను పరిష్కారం చేయాలని డీపీఓ యాదయ్య ను ఆదేశించారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం తో మండల విలేఖరులు డీపీఓ యాదయ్య ను సంప్రదించి సమస్య తీవ్రతను తెలుపుతూ వివరణ కోరారు. వెంటనే స్పందించిన డీపీఓ యాదయ్య శంఖాపూర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక ను వెంచర్ వద్ద అక్రమంగా నిర్మాణం చేసిన గోడలు రెండు రోజులలో తొలగించాలని నిర్వాహకులకు నోటీసులు పంపాలని ఆదేశించారు. అనంతరం క్షేత్ర స్థాయి పరిశీలన చేసి వివరాలను తెలపాలని డీఎల్పీఓ యాదయ్య ను ఆదేశించారు. డీఎల్పీఓ యాదయ్య నివేదిక పంపినా సమస్య మాత్రం పరిష్కారం జరగలేదు. విసిగి వేసారిన రైతులు నూతన కలెక్టర్ ప్రతిమా సింగ్ తో ప్రజావాణి లో కలిసి తమ గోడును వినిపించి, సమస్య పరిష్కారం కోసం వేడుకున్నారు. రైతుల బాధల పై చలించిన కలెక్టర్ వెంటనే స్పందిస్తూ ఇంతకాలంగా సమస్య పరిష్కారం చేయకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల తో డీపీఓ యాదయ్య ఎట్టకేలకు స్పందిస్తూ వెంచర్ లో అక్రమంగా నిర్మించిన గేటు, ప్రహరీ గోడలను శంఖాపూర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక ను ఆదేశించారు. మంగళవారం మౌనిక పంచాయతీ సిబ్బంది, జేసీబీ తో పాటు వెంచర్ కు చేరుకుని, గేటు ప్రహరీ గోడలను పూర్తిగా తొలగించారు. తమ వ్యవసాయ పొలాలకు వెళ్లకుండా, వ్యవసాయం చేయనివ్వకుండా నిలువరించి తమ పొట్ట కొట్టిన అక్రమ వెంచర్ గేటు, ప్రహరీ గోడలు తొలగించి తమ కష్టాలను తీర్చిన కలెక్టర్ ప్రతిమా సింగ్, సమస్య పరిష్కారం లో ముఖ్య పాత్ర పోషించిన మండల విలేఖరులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు .