రోడ్ల నిర్మాణంపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్ష
దౌల్తాబాద్ నవంబర్ 01 (ప్రజాస్వరం):
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గంలోని రోడ్ల అభివృద్ధి పనుల పురోగతిపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, రోడ్లు-భవనాల శాఖ అధికారులతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా రోడ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రోడ్ల నాణ్యతపై ఎటువంటి రాజీ లేకుండా పనులు నిర్వహించాలని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పాడైన రహదారులను ప్రాధాన్యతా క్రమంలో మరమ్మతు చేయాలని సూచించారు. అధికారులు మాట్లాడుతూ పంచాయతీ రాజ్ రోడ్ల అభివృద్ధికి HAM పద్ధతిలో రూ.30 కోట్లు 62 లక్షలు ఇటీవల మంజూరైనట్లు తెలిపారు. అదనంగా మరో రూ.30 కోట్ల నిధులతో 25 రోడ్లను ప్రతిపాదించినట్లు వివరించారు. నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి చెందని రోడ్లను గుర్తించి, మరో రూ.20 కోట్ల వ్యయంతో 30 రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎనగుర్తి–శిలాజి నగర్, మొండిచింత–బేగంపేట వరకు గల ఆర్‌అండ్‌బీ రోడ్ల పునరుద్ధరణకు రూ.67 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు తెలిపారు. హబ్సీపూర్–దుబ్బాక వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం 40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఇఈ నాయుడు, డీఈ వెంకటేష్, పంచాయతీ రాజ్ డీఈలు విజయ్ ప్రకాష్,సూర్య ప్రకాష్,ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు.


