పరీక్ష కేంద్రాలను సందర్శించిన మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్..
ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు....
మెదక్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
మెదక్ జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నేపథ్యంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ టౌన్ కేంద్రంలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు, మెడికల్ ఎమర్జెన్సీ టీమ్‌లు, విద్యార్థులకు కల్పించిన కనీస వసతులు తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎవ్వరూ గుంపులుగా తిరగడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడుతున్నందున, పరీక్ష కేంద్రం చుట్టూ 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా పరీక్షలు రాయాలని, తల్లిదండ్రులు, ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


