ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటున్న సర్పంచ్....
జోరుగా అభివృద్ధి పనులు ప్రారంభం....
త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు బోరు....
మెదక్, మార్చ్ 07 (ప్రజాస్వరం):
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన మెదక్ మండలం మక్త భూపతిపూర్ సర్పంచ్ కొమ్ము పవన్ కుమార్ గెలుపొందిన నాలుగు నెలల్లోనే గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు వాగ్దానాలు ఇవ్వడంతో ప్రజలు ఆయనపై ఉన్న నమ్మకంతో అత్యధిక మెజార్టీతో సర్పంచ్గా గెలిపించారు. దీంతో ఆయన ఎన్నికల హామీలను యుద్ధ ప్రాతిపదికన గ్రామ సమస్యలను ఒక్కొక్క హామీని నెరవేర్చుతూ, గ్రామ ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నాడు. గ్రామంలో ఇప్పటికే సంఘ భవన నిర్మాణం పాఠశాలల ప్రహరి గోడలు తదితర పనులు చేపడుతూ, మరికొన్ని అభివృద్ధి పనులను చేపట్టేందుకు ప్రణాళికలు చేపడుతున్నాడు. అందులో భాగంగా తాజాగా గ్రామంలోని పలు వార్డుల్లో నెలకొన్న త్రాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారం తో ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించి గ్రామంలోని పలు వార్డుల్లో బోరు బావులు వేయించడం జరిగింది. వీటిలో పుష్కలంగా నీళ్లు పడడంతో బోర్ బావుల్లో మోటార్లను బిగించి తాగునీటిని సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే గ్రామస్తులు తమ గ్రామ సర్పంచ్ కొమ్ము పవన్ కుమార్ ను ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల సర్పంచులు కూడా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రశంసలు పొందాలని సూచిస్తున్నారు. మండల స్థాయిలో తమ సర్పంచ్ కు ఉత్తమ సర్పంచ్ అవార్డు దక్కేలా జిల్లా స్థాయి అధికారులు తమ సర్పంచ్ ను ప్రోత్సహిస్తూ కృషి చేయాలని మక్త భూపతిపూర్ గ్రామ ప్రజలు కోరుతున్నారు.


