హోలీ పండగ పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు...
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు...
జిల్లా ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు....
ప్రశాంత వాతావరణంలో కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి...
మెదక్, మార్చి 02 (ప్రజాస్వరం):
ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో కుటుంబ సమేతంగా సంతోషంగా హోలీ పండగను జరుపుకోవాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు కోరారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపి జరిమానాలకు, రోడ్డు ప్రమాదాలకు కారకులై జైలు పాలుకావద్దని హెచ్చరించారు. హోలీ పండగ వేళ మన తోటి అడపడుచుల పట్ల గౌరవప్రదంగా నడుచుకోవాలని, పండగ పేరుతో అనవసరంగా కొత్త చిక్కులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. గొడవలకు, అల్లర్లకు పాల్పడితే అస్సలు ఉపేక్షించబోమని, చట్టపరమైన చర్యలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో పండగ వేళ మద్యం మత్తులో చెరువులు, కుంటాల వద్ద స్నానాలకు వెళ్లి ప్రమాదాలకు గురై అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చిన ఘటనలను గుర్తు చేశారు. మద్యం మత్తులో ఎవరూ కూడా చెరువులు, కుంటాల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు. చిన్న పిల్లలు తప్పనిసరిగా తల్లిదండ్రుల సమక్షంలోనే స్నానాలకు వెళ్లాలని, అతి ఉత్సాహంతో ప్రమాదాలకు గురి కాకూడదని అన్నారు. పిల్లల కదలికల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా దృష్టి పెట్టాలని, పిల్లల భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని తెలిపారు. మన ఆనందం శాశ్వతంగా ఉండాలి. కానీ క్షణిక ఆనందం కోసం హోలీ పండగ వేళ చేసిన తప్పులు, జరిగిన ప్రమాదాలు లేదా మన అజాగ్రత్త వల్ల ఇతరులు ప్రమాదాలకు గురైతే, ఆ పండగ మొత్తం కుటుంబానికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని హెచ్చరించారు. ఈ హోలీ పండగ ప్రతి ఒక్కరి జీవితాన్ని రంగులమయం చేయాలని ఆకాంక్షిస్తూ, జిల్లా ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.


