సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్....
నేర శోధనలో సీసీ కెమెరాల పని తీరు భేష్..
క్రైమ్ ఫ్రీ జిల్లా గా మార్చడమే సురక్ష నేత్ర కార్యక్రమం.
గజ్వేల్ /వర్గల్ మార్చి 02 (ప్రజాస్వరం) :
సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా మండలంలోని మీనాజీపేట్ గ్రామంలో సిద్దిపేట సీపీ సాధన రష్మీ పెరుమాళ్ సీసీ కెమెరాలను ప్రారంభించారు. స్నేహ ఫౌండేషన్ వారి సహకారంతో గ్రామంలోని ఎంట్రీ ఏక్సిట్ ఏరియాల్లో 19 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాల వలన గ్రామ భద్రత పెరుగుతుందని, నేర శోధనలో సీసీ కెమెరాల ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. సిద్దిపేట జిల్లాలను ‘క్రైమ్ ఫ్రీ’ గా మార్చడానికి ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ అనే ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కెమెరాల పనితీరును ఎల్లవేళలా పరిశీలించాలని వాటి నిర్వహణ చూసుకోవాలని గ్రామ పాలకవర్గానికి సూచించారు. ఏసీపీ నర్సింలు మాట్లాడుతూ.. నిఘా నేత్రాలు గ్రామంలో ఉంటే భద్రత ఎక్కువగా ఉంటుందని, దొంగతనాలు, దోపిడీలు జరగకుండా కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఇటీవల మండలంలో జరిగిన హత్య కేసులో సీసీ కెమెరా ఫుటేజ్ ఎంతో కీలకం మారిందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్నేహ ఫౌండేషన్ ఛైర్మెన్ రాజేందర్ రెడ్డి, గజ్వెల్ సీఐ రవి రాజు, గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కీసరి వెంకటేష్, ఉపసర్పంచ్ రాణి సహదేవ్ గౌడ్, పంచాయితీ సెక్రటరీ బాబు రావు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు, పాల్గొన్నారు.


