గోపాలమిత్ర నూతన భవన ప్రారంభోత్సవం...
ఉచిత పశు వైద్య శిబిరం
తూప్రాన్, ఫిబ్రవరి, 25.( ప్రజాస్వరం ) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి:
పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ మరియు పశుగణాభివృద్ధి సంస్థ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మనోహరాబాద్ మండలం రామాయపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోపాలమిత్ర నూతన భవనాన్ని ప్రారంభించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి హాజరై భవనాన్ని ప్రారంభించి శిబిరాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి రైతులు పశుసంపదను పెంపొందించుకోవాలని, పశువులకు ఏవైనా అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే సమీపంలోని పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, వైద్య సేవలను సద్వినియోగం చేసుకుని పాడి పరిశ్రమను అభివృద్ధి పరచాలని రైతులకు పిలుపునిచ్చారు.జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ ఎస్. వెంకటయ్య, పశుగణాభివృద్ధి సంస్థ ఈవో డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ పశువులలో ఎద లక్షణాలను సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యమని చెప్పారు. కృత్రిమ గర్భధారణ ద్వారా మేలుజాతి దూడలు పొందవచ్చని, ముఖ్యంగా సెక్స్ సార్టెడ్ సీమెన్ వినియోగం వల్ల సుమారు 90 శాతం వరకు ఆడదూడలు జన్మించే అవకాశం ఉందని వివరించారు. ఈ విధానాన్ని రైతులు విస్తృతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. గోపాలమిత్రలు ఇంటింటికి వెళ్లి కృత్రిమ గర్భధారణ సేవలు అందిస్తూ మేలుజాతి దూడల జననం, పాల దిగుబడి పెంపులో కీలక పాత్ర పోషిస్తున్నారని అధికారులు అభినందించారు.రామాయపల్లి గ్రామ సర్పంచ్ జక్కుల సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో గోపాలమిత్ర నూతన భవనం ఏర్పాటవడం ఆనందదాయకమని తెలిపారు. గోపాలమిత్ర రామస్వామి గ్రామంలో అందుబాటులో ఉండి పాడిపశువులకు అవసరమైన సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. ఏడి డాక్టర్ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో గర్భకోశ సంబంధిత వ్యాధులకు చికిత్సలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మొత్తం 128 గేదెలు, 15 ఆవులకు వివిధ రకాల చికిత్సలు అందించారు.మందుల పంపిణీలో Alembic Pharmaceuticals మరియు Elanco సంస్థలు సహకారం అందించాయి. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకళ శ్రీనివాస్, ఏడి డాక్టర్ తిరుపతి, తూప్రాన్ మండల పశు వైద్య అధికారి డాక్టర్ లక్ష్మి, చిన్న శంకరంపేట పశువైద్య అధికారి గీతా మాలిక, కాగజ్ మద్దూరు పశువైద్య అధికారి డాక్టర్ స్వప్న, పంచాయితీ కార్యదర్శి కవిత, గోపాలమిత్ర సూపర్వైజర్ సత్యనారాయణ, తూప్రాన్ మరియు మనోహరాబాద్ మండలాల పారా వెట్స్, సబ్ ఆర్డినేట్లు, వివిధ కేంద్రాల గోపాలమిత్రలు, గ్రామ వార్డు సభ్యులు, పాడి రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరం ద్వారా గ్రామీణ పశుకాపరులకు మెరుగైన వైద్య సేవలు అందడంతో పాటు పశుసంపద అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.


