భక్తిశ్రద్ధలతో సామూహిక కుంకుమార్చన..
By Prajaswaram
On
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) :
నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా, స్థానిక శ్రీ సరస్వతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా, కన్నులపండువగా నిర్వహించారు.వినాయక నవరాత్రుల పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమానికి మహిళలు చాలా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి, పూజా సామాగ్రితో తరలివచ్చిన మహిళలతో వినాయక మండపం భక్తిభావంతో మురిసిపోయింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు నడుమ మహిళలందరూ ఒకేచోట కూర్చుని ఏకమనస్సుతో గణనాథునికి, లక్ష్మీస్వరూపానికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న మహిళలు మాట్లాడుతూ లోక కల్యాణం కోసం, తమ కుటుంబాలు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని విఘ్ననాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి ఏటా శ్రీ సరస్వతి యూత్ సభ్యులు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. ఈ విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో శ్రీ సరస్వతి యూత్ అసోసియేషన్ సభ్యులు కీలక పాత్ర పోషించారు. మైలారం శ్వేత, మాధవి, లావణ్య, బాలమణి, భాగ్య, సునీత, రామవ్వ, నిమ్మ స్వప్న, ధర్మకర్ తులసి లతో పాటు పలువురు కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చిన మహిళలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకున్నారు. పూజానంతరం భక్తులందరికీ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
Latest News
21 Sep 2026 16:12:42
నార్సింగ్, సెప్టెంబర్ 21( ప్రజాస్వరం) : నార్సింగ్ మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. భక్తుల కోర్కెలు తీర్చే విఘ్నేశ్వరుడి ఉత్సవాల్లో భాగంగా,...


