చైనా మాంజా వాడితే కఠిన చర్యలు..
సీఐ పి.నరేశ్ హెచ్చరిక
అమీన్‌పూర్, జనవరి 31(ప్రజాస్వరం):
పండగ సీజన్‌లో ప్రాణాంతకంగా మారుతున్న చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు అమీన్‌పూర్ పోలీసులు వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అమీన్‌పూర్‌లో శనివారం తులసివనం కాలనీతో పాటు ఐలాపూర్ గ్రౌండ్ వద్ద ప్రజలకు చైనా మాంజా వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది కాలనీ వాసులు, యువత పాల్గొన్నారు. గాలిపటాలు ఎగురవేసే సమయంలో పర్యావరణానికి, పక్షులకు, మనుషులకు తీవ్ర హాని కలిగించే సింథటిక్ (చైనా) మాంజాను ఉపయోగించవద్దని పోలీసులు సూచించారు.
ఈ సందర్భంగా అమీన్‌పూర్ ఇన్‌స్పెక్టర్ పి.నరేశ్ మాట్లాడుతూ నిషేధిత చైనా మాంజా విక్రయించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అటువంటి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ క్రైమ్ సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


