పోలీసుల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ ధ్యేయం..
గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య శిబిరం....
గజ్వేల్, 17 మార్చి (ప్రజాస్వరం):
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99' కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 63 మంది పోలీసు సిబ్బందికి ఈ శిబిరంలో సుమారు 59 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ రాత్రి పగలు తేడా లేకుండా, సొంత ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం శ్రమిస్తున్న పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. పోలీసులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజ శ్రేయస్సు, ప్రజల రక్షణ సాధ్యమవుతుంది. విధి నిర్వహణలో ఒత్తిడికి గురయ్యే పోలీసులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని సూచించారు. ఈ వైద్య శిబిరంలో పోలీసులకు రక్తపోటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏసీపీ నరసింహులు, సీఐ రవికుమార్, ట్రాఫిక్ సీఐ మురళి, ఆసుపత్రి ఆర్.ఎం.ఓ డాక్టర్ రాము, డాక్టర్ శ్రీధర్, ల్యాబ్ టెక్నీషియన్లు దొడ్డి రమేష్, జీవన, రచన, శ్రీను, పోలీస్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


