రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు....
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి....
కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలు......
రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది....
లారీల కొరతతో ధాన్యం తరలింపులో జాప్యం....
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..
ప్రజాస్వరం : మెదక్ ,మే 18 :
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని, లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రైతులు రోజులు తరబడి ధాన్యం వద్దే కాపలా కాస్తూ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోనె సంచులు, సుత్తిల్లు వంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతోందని, దీంతో కేంద్రాల్లో వడ్ల కుప్పలు పేరుకుపోతున్నాయని అన్నారు. వర్షాలు పడితే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.వడ్ల కొనుగోలు విషయంలో ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మధ్య సమన్వయం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం బాధ్యతను అధికారులపై నెట్టేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పంట కొనుగోలు బాధ్యతను పూర్తిగా కలెక్టర్లు, అధికారులపై వేస్తున్నారని, మంత్రులు, ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేకపోవడం వల్లే కొనుగోలు కేంద్రాల్లో జాప్యం ఏర్పడుతోందని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ హయాంలో రైతులు పండించిన ప్రతి గింజను సకాలంలో కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశామని గుర్తుచేశారు. రైతుబంధు, రైతు భరోసా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు మళ్లీ కష్టాల్లోకి నెట్టబడ్డారని ఆరోపించారు. రైతులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు వేగవంతం చేసి, ధాన్యాన్ని త్వరితగతిన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.అదేవిధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ మైనర్ బాలిక వేధింపుల కేసులో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీ పోరాటాల కారణంగానే 10 రోజుల తర్వాత ప్రభుత్వం స్పందించి అరెస్టు చేసిందన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. బాధిత బాలికకు న్యాయం జరిగేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, సొసైటీ చైర్మన్లు బాదే. చంద్రం, బాపురెడ్డి, సదాశివలింగం,మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, మాజీ సర్పంచ్ బజాజ్ తిరుమల గౌడ్, రంజిత్ గౌడ్, చిన్న తిరుమల్ గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బొప్పారం రాజు గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


