పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష....
మెదక్ జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్...
బాధితురాలికి రూ.2 లక్షల విక్టిమ్ కంపెన్సేషన్ మంజూరు..
ప్రజాస్వరం : తూప్రాన్ ,మే 6 :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 లో మతిస్థిమితం లేని మైనర్ బాలికపై జరిగిన అమానుష లైంగిక దాడి కేసులో బుధవారం ప్రత్యేక పోక్సో కోర్టు వెలువరించిన తీర్పు సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచిందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ తెలిపారు. నిందితుడు అర్కెల నాగేశ్‌కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించడంతో పాటు, బాధితురాలి మానసిక వేదన, పునరావాసం దృష్ట్యా రూ.2,00,000 విక్టిమ్ కంపెన్సేషన్ మంజూరు చేయడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. ఈ ఘటనలో మైనర్ బాలికపై జరిగిన దారుణం అత్యంత విషాదకరమని, ఆమె మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో గర్భవతి అయినా విషయాన్ని కూడా గుర్తించలేకపోవడం సమాజాన్ని కలచివేస్తుందని ఎస్పీ అన్నారు. ఆరు నెలల తర్వాత విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసి, పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకున్నామని వివరించారు. ప్రస్తుతం బాధితురాలికి 7 సంవత్సరాల వయస్సు గల కుమారుడు ఉన్నాడని తెలిపారు. దాదాపు ఆరు సంవత్సరాల పాటు సాగిన ఈ కేసులో ప్రజా అభియోగాధికారి బాలయ్య సమర్థంగా వాదనలు వినిపించడం, భరోసా కేంద్రం లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ స్వేత గారు బాధితురాలికి మానసిక ధైర్యం నింపి, ఆమె సాక్ష్యం చెప్పడనికి సిద్ధం చేసి కేసు విజయంలో కీలకమయ్యాయని అన్నారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ కె.సురేష్ కుమార్ , దర్యాప్తు అధికారి డీఎస్పీ కిరణ్ కుమార్ , లైజనింగ్ అధికారులు ఎసై విఠల్, కృష్ణ, కోర్టు సీడీఓ నాగరాజు అందరి కృషి అభినందనీయమని ఎస్పీ తెలిపారు. చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టడంలో పోక్సో చట్టం అత్యంత కఠినమైందని, ఇటువంటి నేరాలకు పాల్పడేవారికి తప్పనిసరిగా కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. న్యాయం ఆలస్యమైనా తప్పక జరుగుతుందనే సందేశాన్ని ఈ తీర్పు స్పష్టంగా ఇస్తోందని ఎస్పీ పేర్కొన్నారు. బాధితురాలి ధైర్యం, అధికారుల నిబద్ధత, న్యాయవ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు కలిసొచ్చినప్పుడు నేరాలకు తావుండదని అన్నారు. చిన్నారి భవిష్యత్తు కాపాడటం మనందరి బాధ్యత అని పునరుద్ఘాటించారు.


