జిహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్..
రహదారిపై ఆక్రమణలు తొలగింపు
అమీన్ పూర్, జనవరి 31(ప్రజాస్వరం):
అమీన్ పూర్ జిహెచ్ఎంసి పరిధిలో ఆక్రమణల తొలగింపునకు అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. నరే గూడెం నుంచి కిష్టారెడ్డిపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా ఏర్పాటైన అక్రమ షెడ్లు, తడకలను తొలగించేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది.
రహదారిపై రాకపోకలకు ఆటంకంగా మారిన తాత్కాలిక నిర్మాణాలను గుర్తించిన అధికారులు, జెసిబి యంత్రాల సహాయంతో వాటిని కూల్చివేశారు. కర్రలు, షీట్లతో ఏర్పాటు చేసిన తడకలను పూర్తిగా తొలగించి రహదారిని వెడల్పు చేశారు.
ఈ చర్యలను జిహెచ్ఎంసి అమీన్ పూర్ డిప్యూటీ కమీషనర్ ప్రదీప్ కుమార్ స్వయంగా పర్యవేక్షించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపినట్లు అధికారులు తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా రహదారిని ఆక్రమించిన వ్యాపారులు, వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో వేగవంతం చేస్తూ జిహెచ్ఎంసి అధికారులు, ఆర్వో మనోహర్, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి విస్తృతంగా చర్యలు కొనసాగిస్తున్నారు.


