ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి....

ప్రజావాణిలో NHRC, సామాజిక కార్యకర్తల వినతి...

ఆదిలాబాద్‌లోనే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి....

ఆదిలాబాద్ , జనవరి 31(ప్రజాస్వరం):

ఆదిలాబాద్ జిల్లా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రభుత్వం ప్రతిపాదించిన యూనివర్సిటీని నిర్మల్ జిల్లాలో కాకుండా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (NHRC) ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా NHRC ఆదిలాబాద్ జిల్లా వైస్ చైర్మన్ రాథోడ్ సందీప్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసి, గిరిజన, లంబాడా జనాభా అధికంగా ఉండటంతో పాటు వేలాది మంది విద్యార్థులు నివసిస్తున్నారని తెలిపారు. ఉన్నత విద్య కోసం ఇతర జిల్లాలకు వెళ్లాల్సి రావడం వల్ల విద్యార్థులు ఆర్థిక భారంతో పాటు రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నిర్మల్ జిల్లాలో జరిగిన సభలో యూనివర్సిటీని నిర్మల్‌కు కేటాయిస్తామని ప్రకటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగా విస్తీర్ణంగా ఉండటంతో పాటు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న ప్రాంతమని, ఇక్కడే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే విద్యాభివృద్ధి వేగవంతమవుతుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాకు సమీపంలో నిజామాబాద్‌లో తెలంగాణ యూనివర్సిటీ అందుబాటులో ఉండగా, ఆదిలాబాద్ విద్యార్థులకు అది దూరంగా ఉండటం వల్ల ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. గిరిజన విద్యార్థుల డ్రాపౌట్స్‌ను తగ్గించాలన్నా, సమాన విద్యావకాశాలు కల్పించాలన్నా ఆదిలాబాద్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం అత్యవసరమని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సాబ్లే సంతోష్, గిరిజన లైవ్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ మహేందర్, NHRC మండల చైర్మన్ నర్సింగ్ దాస్, కృష్ణ, శ్రీకాంత్, కాంగ్రెస్ కార్యకర్త సోలంకి ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచులు, సర్పంచ్ అభ్యర్థులు రాజేందర్, గంగాధర్, జితేందర్, సుశీల్‌తో పాటు విద్యార్థులు జె. శ్రీనివాస్, విగ్నేష్, రాథోడ్ శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు.ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం చేయాలంటూ తమ వినతిని ప్రభుత్వం సానుకూలంగా పరిగణలోకి తీసుకోవాలని వారు కోరారు.