ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలి
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, జనవరి 21(ప్రజా స్వరం): ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న వ్యవసాయ పరికరాలను రైతులు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
బుధవారం కలెక్టరేట్ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న 43 మంది రైతులకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చేతుల మీదుగా రొటావేటర్, కల్టివేటర్, తైవాన్ ప్రేయర్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ యాంత్రికరణ పథకం ద్వారా రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించడం జరుగుతుందని, రైతులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు వ్యవసాయానికి వాడుకునే పరికరాల కొనుగోలుకు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీపై వ్యవసాయ పరికరాలతో పాటు పిచికారి యంత్రాలను కూడా అందజేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులు వ్యవసాయ పరికరాల నిమిత్తం దరఖాస్తు చేసుకోవాలని అదేవిధంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం, జిల్లా ఉద్యానవన అధికారి సత్తార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లు శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, అంజయ్య, విజయ భాస్కర్ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.


