మెడికల్ షాపులను తనిఖీ చేసిన డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్ర కళ
నార్సింగి, నవంబర్ 6( ప్రజా స్వరం)
నార్సింగి మండలంలో పలు మెడికల్ షాప్ లను గురువారం డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, ఔషధాల నిలువ పలు విషయాల పై తనిఖీ చేశారు. అనంతరం చంద్రకళ మాట్లాడుతూ మండల కేంద్రం లోని 8 మెడికల్ దుకాణాలలో సమయాభావం వలన 4 దుకాణాలను తనిఖీ చేశామని, మిగతా దుకాణాలలో కూడా త్వరలోనే తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. తనిఖీ చేసిన వాటిలో ఒక దుకాణంలో ఫార్మాసిస్ట్ లేకుండానే అమ్మకం చేస్తున్న విషయం నిర్ధారణ అయ్యిందని, మరో దుకాణంలో మందులు కొన్నట్టుగా రసీదు ఉన్నా స్టాక్ లేదని, సప్లయర్ వద్ద నుంచి రాలేదని నిర్వాహకుడు తెలిపినా దాని పై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక దుకాణంలో ఫార్మాసిస్ట్ లేకుండానే దుకాణం తెరిచి ఉంచారని చెప్పారు. మొత్తం మీద దుకాణాలలో రికార్డులు సరి పోయాయని, ఎక్పైర్ అయిన ఔషధాలు, నిషేధిత మందులు లభించలేదని అన్నారు. మెడికల్ షాప్ నిర్వహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలు పాటించాలని, షెడ్యూల్ హెచ్ మందులు, యాంటీ బయోటిక్ వంటి మందులు డాక్టర్ చీటి లేకుండా ఇవ్వకూడదని, ఉల్లంఘించిన వారి పై సంభందిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం తో పాటు దుకాణాన్ని సీజ్ చేయడం జరుగుతుందని డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్ర కళ హెచ్చరించారు.


