బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయాలి...
రజక సంఘం నాయకులు...
జగదేవ్ పూర్, ఫిబ్రవరి 25 (ప్రజాస్వరం):
నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దేవాలయంలోకి దైవదర్శనానికి రజకులు వెళుతున్న క్రమంలో కొంతమంది రెడ్డి కులస్తులు అడ్డుకొని రజకుల పై దాడి చేయడంతో పాటు రెండు నెలల చిన్నారి మృతి చెందిన సందర్భంగా ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో రజక సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసిల్దార్ నిర్మలకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షుడు రాచకొండ సీతారాములు మాట్లాడుతూ అగ్రవర్ణ దురహంకారంతో వ్యవహరిస్తూ రెడ్డి కులస్తులు దైవదర్శనాన్ని అడ్డుకొని దాడి చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. ఈ విషయంలో సమస్యను పక్క దోవ పట్టించి నిందితులను కాపాడడానికి ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు. బాధిత రజకులకు ప్రభుత్వం న్యాయం చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రాచకొండ యాదగిరి బాల్ నరసయ్య, అనుమాండ్ల మనోహర్ జూపల్లి భాస్కర్ వడ్లకొండ దుర్గయ్య రాచమల్ల నర్సింలు కనకయ్య కిష్టయ్య రాచకొండ మహేష్ ఉమ్మరాజు నాగరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


