దౌల్తాబాద్ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు...
విద్యార్థుల సిద్ధతపై ప్రత్యేక దృష్టి
దౌల్తాబాద్, జనవరి 3 (ప్రజాస్వరం):
దౌల్తాబాద్ మండలంలోని పాఠశాలలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండల పరిధిలోని ఉప్పర్‌పల్లి, గువ్వలేగి, గోవిందాపూర్, పోసాన్‌పల్లి, కోనాయిపల్లి, దీపాయంపల్లి, గొడుగుపల్లి, మల్లేశంపల్లి పాఠశాలలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఫౌండేషనల్ లిటరసీ స్టడీ (ఎఫ్‌ఎల్‌ఎస్) జాతీయస్థాయి సర్వేకు సంబంధించి మూడో తరగతి విద్యార్థులను ఏ విధంగా సిద్ధం చేస్తున్నారో పరిశీలించారు. నల్లబల్లపై ఆంగ్లం, గణితం పాఠాలను విద్యార్థులతో చేయించి వారి ప్రతిభను పరీక్షించారు.
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మాదిరి పరీక్షలు నిర్వహించి జాతీయస్థాయి పరీక్షకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణ పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని తెలిపారు.
గోవిందాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గొడుగుపల్లి పాఠశాలలో విద్యార్థులతో తెలుగు, ఆంగ్ల పఠనాన్ని చేయించారు. ప్రతి పాఠశాలలో ఉదయం 5 గంటలకు ట్యూషన్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు సహకరించాలని తెలిపారు. వివిధ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు, ప్రధానోపాధ్యాయులు రూప్‌సాగర్, రజిత, మాధురి, బాల్‌రెడ్డి, ఉమారాణి, సీఆర్‌పీలు గాడి రాజు, ముత్యం గారి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.


