ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?”
మాక్త మాసన్ పల్లి రైతుకు గజ్వెల్ ఎమ్మార్వో స్వామి సూచన...!
సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఓ రైతుకు అవమానం ఎదురైందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ వ్యవసాయ భూమి ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో పోతున్న నేపథ్యంలో భూ రికార్డుల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతుతో గజ్వేల్ ఎమ్మార్వో మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. “ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?” అంటూ ఎమ్మార్వో అవహేళనగా మాట్లాడారని రైతు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసన్ పల్లి గ్రామానికి చెందిన రైతు శాతం రాజు అలియాస్ ఏసు భూ సమస్య ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రైతు శాతం రాజుతో పాటు ఆయన ముగ్గురు అన్నదమ్ములకు సర్వే నంబర్ 65లో ఉన్న భూమిలో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు కోసం 1 ఎకరం 17 గుంటలు పోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భూమికి సంబంధించి 2007 వరకు శాంతం అనసూయ పేరు పై రికార్డులు ఉన్నాయని, ఇప్పటికీ భూమి తము కబ్జాలోనే ఉన్నామని రైతు కుటుంబం తెలిపింది.కానీ 2008లో భూమి శాతం పోచమ్మ పేరుపై ఆన్‌లైన్‌లో నమోదైందని, ట్రిపుల్ ఆర్ భూసేకరణ సమయంలో ఆన్‌లైన్ రికార్డులు పరిశీలించగా ఈ విషయం బయటపడిందని రైతు కుటుంబం పేర్కొంటోంది. దీంతో సమస్య పరిష్కారం కోసం పలుమార్లు గజ్వేల్ ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరిగినట్లు తెలిపింది..ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఎమ్మార్వోతో రైతుకు జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. భూ సమస్యతో ఇబ్బందులు పడుతున్న తనను ఉద్దేశించి “ఇంకా పురుగుల మందు తాగలేదా.. బ్రతికే ఉన్నావా?” అంటూ ఎమ్మార్వో మాట్లాడారని రైతు ఆరోపిస్తున్నారు.తన పరిస్థితి చూసి నవ్వు వస్తుందా అని రైతు ప్రశ్నించగా, “అవును వస్తది.. బరాబర్ వస్తది” అంటూ ఎమ్మార్వో సమాధానం ఇచ్చినట్లు వీడియోలో వినిపిస్తోంది.ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రైతుల పట్ల అధికారుల వ్యవహారశైలి పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ భూమి విషయంలో సమస్య ఎదుర్కొంటూ, జీవనోపాధిపై ఆందోళన చెందుతున్న రైతు పట్ల ఇలాంటి వ్యవహారశైలి ఎంతవరకు సమంజసమని పలువురు ప్రశ్నిస్తున్నారు.


