హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు..
రూ.5 వేల జరిమానా...
కుటుంబ కలహాలతో భర్త హత్య.. భార్య, ఆమె తండ్రికి జీవిత ఖైదు..
ప్రతినిధి
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ లో కుటుంబ కలహాల నేపథ్యంలో వెంకటేష్‌ను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన కేసులో నిందితులైన భార్య విజయ, ఆమె తండ్రి నర్సింలుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పు వెలువరించినట్లు మెదక్ జిల్లా అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఐపీఎస్ తెలిపారు.వివరాల్లోకి వెళ్తే.. తూప్రాన్ మండలం ఘనపూర్‌కు చెందిన దొడ్ల వెంకటేష్ (38) తన భార్య విజయ, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 01.09.2023న రాఖీ పండుగ సందర్భంగా విజయ తండ్రి నర్సింలు, ఇతర బంధువులతో కలిసి వెంకటేష్ ఇంటికి వచ్చారు. అదే రోజు రాత్రి సుమారు 11.30 గంటల సమయంలో వెంకటేష్‌ను కొబ్బరి తాళ్లు, చున్నీతో కట్టేసి దాడి చేశారు. అనంతరం అతడిపై వేడి నీళ్లు పోసి గదిలో ఉంచి తాళం వేశారు.ఈ విషయాన్ని విజయ ఫోన్ ద్వారా వెంకటేష్ తమ్ముడికి తెలియజేయడంతో రామంతాపూర్‌కు చెందిన శ్రీనివాస్ ఘనపూర్‌కు చేరుకుని గది తాళం పగలగొట్టి వెంకటేష్‌ను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం తూప్రాన్ ఆస్పత్రికి తరలించగా, వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ వెంకటేష్ మృతి చెందాడు.వెంకటేష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి తూప్రాన్ ఎస్‌ఐ శివానందం కేసు నమోదు చేశారు. అప్పటి తూప్రాన్ సీఐ, దర్యాప్తు అధికారి శ్రీధర్ సమగ్ర దర్యాప్తు చేపట్టి కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్, ఎస్‌ఐ గంగరాజు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితులు విజయ, నర్సింలుకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.కేసులో నిందితులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పకడ్బందీగా సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు, సిబ్బందిని అదనపు ఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఐపీఎస్ అభినందించారు. నేరం చేసిన నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు.ఈ కేసులో కోర్టు లైజనింగ్ అధికారులు ఎస్‌ఐ విట్టల్, కానిస్టేబుల్ రవీందర్‌గౌడ్, సీడీఓ నాగరాజు తూప్రాన్ ఎసై గంగరాజు సహకరించినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.


