అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు....
అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం...
By Prajaswaram
On
చేగుంట,సెప్టెంబర్ 16 (ప్రజాస్వరం) :
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు అలసత్వం వహిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చేగుంట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన రెండో సర్వసభ్య సాధారణ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై వివిధ శాఖల పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. మూడు నెలలకోసారి జరిగే కీలక సమావేశానికి పలువురు శాఖల అధికారులు గైర్హాజరు కావడంపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విద్యాశాఖపై సమీక్ష సందర్భంగా ఇన్‌చార్జ్ ఎంఈవో నీరజతో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని, విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, పౌష్టికాహార పంపిణీపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవితో కలిసి సమీక్షించారు. గృహనిర్మాణ శాఖ సమీక్షలో భాగంగా మండలానికి మంజూరైన 104 ఇళ్లలో 50 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన ఇళ్ల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల సహకారంతోనే అభివృద్ధి పనులు సమర్థవంతంగా ముందుకు సాగుతాయని పేర్కొంటూ, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ పరిధిలో చేపడుతున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ప్రమాదకర విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న తీగలను వెంటనే సరిచేయాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా దోమలు, ఈగల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సౌజన్య డెంగ్యూ నివారణపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ యువత, రైతాంగం సరికొత్త ఉపాధి మార్గాలు, ఆధునిక వ్యవసాయ విధానాల వైపు అడుగులు వేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పట్టణాల్లో క్లౌడ్ కిచెన్‌ల ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో వంట నైపుణ్యం ఉన్నవారు ఈ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున పాడి పరిశ్రమతో పాటు బయోగ్యాస్, ఇథనాల్ వంటి రంగాలపై దృష్టి పెట్టాలని అన్నారు. భవిష్యత్తులో మొక్కజొన్న కీలక వాణిజ్య పంటగా మారే అవకాశం ఉందని, మొక్కజొన్న వ్యర్థాలతో బయో-ప్లాస్టిక్ ఉత్పత్తులు, పేపర్లు, బాటిళ్లు, ప్లేట్లు తదితర వస్తువుల తయారీతో పాటు ఇథనాల్ ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రకృతి వనరులు, వర్షపు నీటిని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. రాబోయే కాలంలో సాంకేతిక, ఆర్థిక రంగాల్లో వేగవంతమైన మార్పులు చోటుచేసుకోనున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలు కూడా అందుకు అనుగుణంగా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హేమ భార్గవి, ఎస్సై చైతన్యకుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Latest News
17 Sep 2026 13:58:02
తూప్రాన్, సెప్టెంబర్ 17 (ప్రజాస్వరం) :ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సరస్వతి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ట్రస్ట్ అధ్యక్షులు...


