ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియతో రెవెన్యూ సిబ్బందిపై అదనపు పని భారం...
ప్రత్యేక ఓటర్ జాబితా పనులతో పాటు రెగ్యులర్ విధులు చేయాలంటున్న అధికారులు..
మెదక్ ,సెప్టెంబర్ 04 (ప్రజాస్వరం) :
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఓటర్ జాబితా కార్యక్రమం (ఎస్‌ఐఆర్) రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లకు అదనపు పని భారంగా మారిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియలో భాగంగా తమను విధుల్లోకి కేటాయించిన ప్రభుత్వం, ఈ సమయంలో రెగ్యులర్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రత్యేక ఓటర్ జాబితా పనులతో పాటు సాధారణ విధులు కూడా నిర్వహించాలని అధికారులు సూచిస్తున్నారని వారు వాపోతున్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా తయారీ ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయిలో వివిధ పనులు చేపట్టాల్సి వస్తోందని సిబ్బంది తెలిపారు. ఇంటింటి పరిశీలన, ఓటర్ల వివరాల పరిశీలన, జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన ప్రక్రియ తదితర పనుల్లో నిమగ్నమై ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఈ పనులతోనే సమయం సరిపోకపోతున్నప్పటికీ, మరోవైపు కార్యాలయాల్లో తమకు కేటాయించిన రెగ్యులర్ విధులను కూడా పూర్తి చేయాలని అధికారులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
**దరఖాస్తుదారుల నుంచి ఆగ్రహం**
రెవెన్యూ కార్యాలయాల్లో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు సాధారణంగా కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి సంబంధిత ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ప్రత్యేక ఓటర్ జాబితా కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సి రావడంతో కార్యాలయాల్లో సాధారణ పనులు ఆలస్యమవుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. దరఖాస్తుదారులు తమ పనుల కోసం కార్యాలయాలకు వచ్చిన సమయంలో సంబంధిత సిబ్బంది అందుబాటులో లేకపోవడం లేదా పనులు వెంటనే పూర్తికాకపోవడంతో అసహనానికి గురవుతున్నారని తెలిపారు. కొంతమంది దరఖాస్తుదారులు తమ పనులు ఎందుకు కావడం లేదంటూ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ఓటర్ జాబితా పనులు, కార్యాలయంలో రెగ్యులర్ విధులు.. ఇలా రెండు రకాల బాధ్యతలను ఒకేసారి నిర్వహించాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని వారు అంటున్నారు.
**పని భారం గుర్తించాలి**
ప్రత్యేక ఓటర్ జాబితా కార్యక్రమం అత్యంత కీలకమైన ప్రక్రియ కావడంతో దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సిబ్బంది పేర్కొన్నారు. ఒకవైపు క్షేత్రస్థాయిలో ప్రత్యేక ఓటర్ జాబితా పనులు, మరోవైపు కార్యాలయంలో రెగ్యులర్ విధులు నిర్వహించడం వల్ల పనుల్లో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సిబ్బందిపై ఉన్న పని భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా కార్యక్రమం పూర్తయ్యే వరకు సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లను రెగ్యులర్ విధుల నుంచి పూర్తిగా మినహాయించాలని, అవసరమైన అదనపు సిబ్బందిని కార్యాలయాల్లో అందుబాటులో ఉంచాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడంతో పాటు, ప్రజలకు అందాల్సిన రెగ్యులర్ రెవెన్యూ సేవలు కూడా సకాలంలో అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


