అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. -పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి.
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-ప్రజావాణి లో దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్
పెద్దపల్లి,సెప్టెంబర్15(ప్రజా స్వరం):
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని,ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.సుల్తానాబాద్ మండలం రెబ్బల్ దేవ్ పల్లి గ్రామానికి చెందిన తాండ్ర శంకర్ తన భూమిలో వేసిన సీసీ రోడ్డు బిల్లు అడ్డుకున్న అధికారుల పై చర్యలు తీసుకుంటూ,తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈఈ పంచాయతీరాజ్ కు రాస్తూ విచారణ చేసి రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ సూచించారు.ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన గట్టు భూమయ్య తన భూమిని ఇసుక రీచ్ లీజుకు కాంట్రాక్టర్ రెండు సంవత్సరాల అగ్రిమెంట్ పై తీసుకున్నారని గడువు ముగిసిందని ప్రస్తుతం తన భూమిలో రెండు వందల లారీల ఇసుక నిల్వ ఉందని,భూమి కౌలు ఇవ్వడం లేదని,తన సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఏడి మైన్స్ కు రాస్తూ అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సైదం మహేష్ సర్వే నెంబర్ 42 లో గల 20 గుంటల భూమికి అసైన్మెంట్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అర్హతను పరిశీలించి నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు.ఓదెల మండల కేంద్రానికి చెందిన నాగపురి రవి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 1034 లో గల నాలుగు ఎకరాలు 20 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేయగా తహసిల్దార్ ఓదెల కు రాస్తూ విచారించి వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.