బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? 

పార్టీ పేరు మార్చే ఆలోచనలో కేసీఆర్ అంటూ ప్రచారం 

బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారనుందా ...? 

ప్రజాస్వరం , హైదరాబాద్ :


బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా అనే అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. వరుస ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, పార్టీ కేడర్ నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోందనే ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లో బలమైన గుర్తింపు ఏర్పడిందని, ఆ పేరును మార్చిన తర్వాతే పార్టీకి గడ్డుకాలం మొదలైందనే అభిప్రాయం పలువురు నేతలు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో తిరిగి బలపడాలంటే పాత పేరుకే మళ్లాలని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.2001లో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ లక్ష్యంతో పార్టీని స్థాపించిన తర్వాత టీఆర్ఎస్ పేరు ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. నీళ్లు, నిధులు, నియామకాల వంటి అంశాలతో ప్రజల్లో సెంటిమెంట్‌ను పెంచుకున్న ఆ పార్టీ,
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అనే స్థాయిలో ఆ బ్రాండ్ గుర్తింపు ఏర్పడింది. అయితే 2022 డిసెంబర్ 9న పార్టీ పేరును బీఆర్ఎస్‌గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా విస్తరించాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాల్లో పర్యటనలు చేసి రైతు అజెండాను ముందుకు తెచ్చారు. అయితే ఈ మార్పు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారాన్ని కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం వంటి పరిణామాలు పార్టీని వెనక్కి నెట్టాయి. ఉపఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలు రాకపోవడం, కేడర్‌లో అసంతృప్తి పెరగడం గమనార్హం. బీఆర్ఎస్‌గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ దూరమైందని, ప్రజలు పార్టీ నుంచి దూరమయ్యారనే అభిప్రాయం బలపడుతోంది. గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుతో ఉన్న అనుబంధాన్ని కోల్పోవడం రాజకీయంగా నష్టమేనని పార్టీ లోపలే చర్చ జరుగుతోంది.ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత వేడెక్కించాయి. మంచిర్యాల జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పార్టీ పేరు మార్పుపై కేడర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ ఈ అంశంపై మాట్లాడని ఆయన ఇప్పుడు స్పందించడం వెనుక వ్యూహం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని తిరిగి టీఆర్ఎస్‌గా మార్చితే జాతీయ రాజకీయాల నుంచి కొంత దూరం కావాల్సి వస్తుందని, రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి
కేంద్రీకరించాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.ఇటీవల చోటుచేసుకున్న వివిధ పరిణామాలు కూడా పార్టీకి ప్రతికూలంగా మారాయి. అగ్ని ప్రమాదాలు, అకాల వర్షాలు, పలు వివాదాలు, నిరుద్యోగ సమస్యలు, సంక్షేమ పథకాల అమలుపై వచ్చిన విమర్శలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. ఎన్నికల్లో వరుస పరాజయాలు పార్టీపై ప్రభావం చూపించాయి. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని చేసిన ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 కవిత కొత్త పార్టీ స్థాపనతో చర్చకు ప్రాధాన్యత .....

 కవిత కొత్త పార్టీ  ఏర్పాటుకు సిద్ధమవుతుండడంతో  కూడా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఈ నెల 25న పార్టీని ప్రకటించే అవకాశముందని సమాచారం రావడంతో బీఆర్ఎస్ కేడర్‌లో కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు కొత్త పార్టీ ప్రభావం, మరోవైపు ఇప్పటికే ఉన్న అసంతృప్తి మధ్య పార్టీ పేరు మార్పు అంశాన్ని ముందుకు తెచ్చారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేడర్ దృష్టి మరల్చేందుకు లేదా ఐక్యతను కాపాడేందుకు ఈ వ్యూహం ఉపయోగపడుతుందా అనే కోణంలో కూడా విశ్లేషణ జరుగుతోంది.మొత్తానికి బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్‌గా మారుతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం పార్టీ అధినేత తీసుకునే 
నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. పేరు మార్పు ద్వారా పాత వైభవాన్ని తిరిగి సాధించగలదా? లేక ఇది కేవలం వ్యూహాత్మక చర్చగానే మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు రానుంది. 

Latest News

పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు .... పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో...
రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......