దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ 

 దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు  : సీఎం రేవంత్ 


మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం
డా అంబేద్కర్ కు సీఎం రేవంత్ నివాళి
ప్రజాస్వరం , హైదరాబాద్ :
కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు.  భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్  135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి , మంత్రులు  ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. “పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ . మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారు.  మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాలను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారు” అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.  “మహిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం మాది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ.  మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్  చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మేధావులు ఆలోచన చేయాలి” అని కోరారు.    దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్రు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్  ఆలోచనే ప్రజాపాలన విధానం.  రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ  ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్.  ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారు.   భారత రాజ్యాంగంలో అంబేద్కర్  జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీ ను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  స్మరించుకున్నారు.  దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు.  కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు.దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు.  “రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నాం.   ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది” అని ముఖ్యమంత్రి  కోరారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,  ధనసరి అనసూయ సీతక్క,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Latest News

పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు .... పశువుల తరలిస్తున్న డీసీఎం ను పట్టుకున్న పోలీస్ లు ....
ప్రజాస్వరం : తూప్రాన్ ,ఏప్రిల్ 18  పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి    తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో NH44 పై టోల్ గేట్ సమీపంలో ఎద్దులను డీసీఎం వాహనంలో...
రేపటినుండి తూప్రాన్ లో రేణుక ఎల్లమ్మ మాత 13వ వార్షికోత్సవ వేడుకలు..
మాదిగలకు 11% రిజర్వేషన్లు పెంచాల్సిందే......
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన.....
తెలంగాణ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం...
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం.....
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం......