జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలి : సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారు
జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ను గెలిపించాలని మైనార్టీల భేటీలో మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని ప్రజలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కోపంగా ఉన్నారని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా వున్నారని సిద్ధిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ సమావేశానికి అయన హజరయ్యారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నదని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని గుర్తు చేయాలని కోరారు. కేసీఆర్ ఉన్నప్పుడు మైనార్టీలు సంతోషంగా ఉన్నారని షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, మైనార్టీ విద్యాసంస్థలు ఏర్పాటు చేసి అందరికీ ఇంగ్లీష్ మీడియం విద్యనందిచారన్నారు. ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ నాలుగువేల కోట్లు మైనార్టీలకు బడ్జెట్ లో కేటాయిస్తామని ఇమామ్, మౌజన్లకు 5 వేల నుంచి 12 వేలకు పెంచుతామని మోసం చేశారన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కేసిఆర్ 20 లక్షలు ఇస్తే మేము 25 లక్షలు ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను తీసుకువచ్చి వారితో మాట ఇప్పించాడని ఎన్నికల తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పత్త లేరని ఎద్దేవా చేశారు. సెక్యులర్ ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి సర్కారు 20 నెలలు గడుస్తున్నా ఒక్క మైనార్టీ నేతను మంత్రిగా చేయలేదని రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినా మైనార్టీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు ప్రమాణస్వీకారం చేసిన మరొక మంత్రి మహమూద్ అలీ అని కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన గౌరవం అది అని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయేలా బుద్ధి చెప్పాలని అన్నారు. హైడ్రా, మూసీ పేర్లతో ముస్లిం సోదరుల ఇళ్లను కూల్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కూల్చిన ఇండ్లకు కనీసం నష్టపరిహారం కూడా చెల్లించలేదని అన్నారు. పొద్దుతిరుగుడు పువ్వు లాగా రేవంత్ రెడ్డి బీజేపీ చుట్టూ తిరుగుతుంటాడని బీజేపీలో చదువుకున్నానని స్వయంగా చెప్పే ముఖ్యమంత్రిని మైనార్టీలు ఎలా నమ్మాలన్నారు. అందరం కలిసి పనిచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడానికి కృషి చేయాలని కోరారు.