బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదం
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా ఆమోదం
హైదరాబాద్, (ప్రజాస్వరం) :
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు సమాచారాన్ని ఆయనకు పంపించింది. దీంతో రాజాసింగ్ ను ఇక భరించడం కష్టమని బీజేపీ డిసైడయిందని అనుకోవచ్చు. ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్ కు లేఖ ఇవ్వాలని ఇప్పటికి బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు. రాజాసింగ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని భావించారు. అయితే తన అనుచరులను కొందరు బెదిరించారని, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ అసంతృప్తితో 2025 జూన్ 30న ఆయన బీజేపీ పార్టీ సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజాసింగ్ పార్టీలో సీనియార్టీని పట్టించుకోలేదని, కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదని గతంలో పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నాయకత్వం, ముఖ్యంగా కిషన్ రెడ్డి , బండి సంజయ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.రాజాసింగ్ జూన్ 30, 2025న తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి సమర్పించారు. ఈ లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపగా, జూలై 11, 2025న రాజాసింగ్ రాజీనామాను పార్టీ అధిష్ఠానం ఆమోదించింది రాజాసింగ్ 2014, 2018, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా 2022లో బీజేపీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు, కానీ 2023 అక్టోబర్‌లో ఎన్నికలకు ముందు సస్పెన్షన్ ఎత్తివేశారు. రాజాసింగ్ గతంలో కూడా 2017, 2018, 2021లో వివిధ కారణాలతో రాజీనామా ప్రకటనలు చేసినప్పటికీ అప్పట్లో ఆయనను పార్టీ నేతలు బుజ్జగించారు. కానీ ఆ సారి రాజీనామా ఆమోదించి ఇక ఆయనను భరించలేమన్న సంకేతాలు పంపారు. రాజాసింగ్ రాజీనామా తెలంగాణ బీజేపీలో తీవ్ర చర్చనీయాంశం అయింది. ఆయన క్రమశిక్షణారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంగా ఉంది. మరో వైపు ఆయన ఏ పార్టీలోనూ చేరే అవకాశాలు లేవు. ఆయనను చేర్చుకునేందుకు అన్ని పార్టీలు సంశయిస్తాయి. గతంలో శివసేన తెలంగాణ శాఖ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అందుకే ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సొంత పార్టీ పెట్టుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.