కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ
వేలాది భక్తులతో కొనసాగుతున్న సింహాచలం గిరి ప్రదర్శణ
సింహాచలం / హైదరాబాద్ ( ప్రజాస్వరం ) :
ఎంతో ప్రతిష్ఠాత్మకమైన విశాఖ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా గిరి ప్రదక్షిణలో ఉత్సాహంగా పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలివచ్చారు. ఇవాళ, రేపు జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తారన్న అంచనాతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలను అధికారులు ఏర్పాటు చేశారు. గిరి ప్రదక్షిణ జరిగే 32 కిలోమీటర్ల పొడవునా అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కొండదిగువ తొలి పావంచా నుంచి సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలయ్యింది.10వ తేదీ సాయంత్రం తిరిగి తొలి పావంచాకు చేరుకోగానే ప్రదక్షిణ పూర్తవుతుంది. భక్తులు మొత్తం 32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తొలి పావంచా వద్ద అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రచార రథం ప్రారంభమైంది. అనంతరం రాత్రి 9 నుంచి 10 గంటల మధ్యలో రథం తిరిగి ఆలయానికి చేరుకుంటుంది. అయితే భక్తులు ఉదయం 9 గంటల నుంచే గిరి ప్రదక్షిణ మొదలుపెట్టారు. స్వామివారి పవళింపు సేవ, ఇతర లాంఛనాల అనంతరం రేపు తెల్లవారుజామున 5 గంటల నుంచి స్వామివారి దర్శనాలు ప్రారంభమవుతాయి. 10వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి.భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రతి 200 మీటర్లకు ఒకటి చొప్పున తాగునీటి పాయింట్లు, 500 మరుగుదొడ్లు, 6 కంట్రోల్ రూమ్లు 5 చోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, 32 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 50 ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా విశాఖ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. రద్దీ ప్రదేశాలు, క్యూలైన్ల వద్ద తోపులాటలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.