సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు ....
అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు....
ప్రజాస్వరం : మేడ్చల్: మే 20 :
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఎం,మంత్రుల పేర్లు చెప్పుకుంటూ వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి నట్లు ఏసీపీ శంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ కేసు వివరాలను వెల్లడించారు. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన సంతోష్ గుప్తా అనే వ్యక్తి మేడ్చల్ పరిధిలోని మునీరాబాద్ లో ఆర్.ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకుడికి ఫోన్ చేసి "నేను సీఎం మనిషిని.. సీఎం రేవంత్ రెడ్డి పీఏని.. పీసీసీ సభ్యుడిని” అంటూ పరిచయం చేసుకున్నాడు. మీ భూమికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి.. వాటిని నేను సెటిల్ చేస్తానని చెప్పి, ప్రతిఫలంగా ఐదు విల్లాలను తనకు విక్రయించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా “వచ్చి కలవకపోతే మీ పని చేస్తా" అంటూ బెదిరింపులకు దిగడంతో బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న మేడ్చల్ పోలీసులు నిందితుడిపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సంతోష్ గుప్తా పలుచోట్ల సీఎం, మంత్రుల పేర్లు ఉపయోగిస్తూ వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చినట్లు ఏసీపీ వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో మేడ్చల్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.


