జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
నార్సింగి, ఫిబ్రవరి 04 ( ప్రజాస్వరం ):
ముస్లింలు ఎంతో మహత్తరమైన రాత్రి గా భావించే రాత్రి షబ్ ఎ బరాత్. ఈ రాత్రి ముస్లింలు మసీదుల్లో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వచ్చే సంవత్సరం వరకు జరిగే జననాలు, మరణాలు, అందరికీ అంద బోయే భోగాల వివరాలను అల్లాహ్ ఈ రాత్రి దేవదూత లకు అందిస్తారని నమ్మకం. అలాగే మృతి చెందిన వారిలోని పెద్ద సంఖ్య లో పాపులను క్షమించి, వారికి స్వర్గ ప్రాప్తి కలగ చేస్తాడని నమ్ముతారు. అందుకే తమకు తమ ఆత్మీయులకు సకల మానవాళి కి మేలు జరగాలని, పూర్వీకులకు మోక్షం జరిగి స్వర్గ లోక ప్రాప్తి కలగాలని మసీదుల లో జాగారం చేసి ప్రార్థిస్తారు. అనంతరం రాత్రి వేళలో ఖబ్రస్తాన్ కు వెళ్లి మరణించిన వారి స్వర్గ లోక ప్రాప్తి కోసం ప్రార్థనలు చేస్తారు. మండల పరిధిలోని అన్ని మసీదుల ను మంగళవారం షబ్ ఎ బరాత్ సందర్భంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పట్టణ కేంద్రంలోని జామియా మస్జీద్ లో కూడా ప్రత్యేక ప్రార్థనలు, మస్జిద్ లో ఖురాన్ అభ్యసిస్తున్న బాల బాలికల తో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జామియా మస్జీద్ అధ్యక్షుడు ఎండీ చాంద్ ఖురేషి అధ్యక్షతన ఏర్పాట్లు చేశారు. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకు బహుమతులను అందజేశారు. షబ్ ఎ బరాత్ పర్వ దినాన మస్జిద్ ఆవరణలో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రత్యేక కార్యక్రమం కోసం పిల్లలకు తర్ఫీదు నిచ్చిన మస్జిద్ ఇమామ్ అహ్మద్ రజా ను సన్మానించారు. చిన్న పిల్లలు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం పట్ల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మస్జిద్ కమిటీ అకౌంటెంట్ సలీం షేక్, బాబు ఖురేషి, గుల్ఫోజ్, ఫరీద్, జమీర్, గౌస్, బాఖర్ పాషా, జహీర్, ముజీబ్, ఏజాజ్ గ్రామ మైనారిటీ సోదరులు పాల్గొన్నారు.


